అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయుర్వేదం కోర్సు పూర్తి చేసుకున్న వైద్యులకు తీపి కబురు చెప్పారు. శిక్షణ పొందిన ఆయుర్వేద వైద్యులను కొన్ని శస్త్ర చికిత్సలు చేయడానికి అనుమతించాలని సర్కార్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాచీన భారతీయ వైద్య విధానాన్ని ఆధునిక వైద్య విధానంతో అనుసంధానిండంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శస్త్ర చికిత్సలో సరైన శిక్షణ పొందిన పోస్ట్-గ్రాడ్యుయేట్ ఆయుర్వేద వైద్యులు స్వతంత్రంగా ఆపరేషన్లు చేయడానికి ఆమోదం తెలిపామన్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.
ఇదిలా ఉండగా ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు . ఈ నిర్ణయం వల్ల అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులు 39 శాతం సాధారణ శస్త్రచికిత్సలు, 19 శాతం ఈఎన్‌టీ (చెవి, ముక్కు , గొంతు) నేత్ర వైద్య చికిత్సలను చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. వీటిలో అంటు వ్యాధుల చికిత్సలు, గాయాలకు కుట్లు వేయడం, పైల్స్, ఫిషర్స్, స్కిన్ గ్రాఫ్టింగ్ వంటి ఇతర రోగాలు కూడా ఉన్నాయి. తదుపరి కార్యాచరణ ప్రణాళికపై ఆయన ఆయుష్ శాఖ డైరెక్టర్ కె దినేష్ , ఇతరులతో విస్తృతంగా చర్చించారు. విజయవాడలోని డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలతో పాటు రాష్ట్రంలో రెండు ప్రైవేట్ ఆయుర్వేద కళాశాలలు ఉన్నాయని అన్నారు.

















