హైదరాబాద్ : పక్షుల కిలకిలరావాలతో.. వలస పక్షుల విడిదితో ఆహ్లాదంగా ఉన్నప్రగతినగర్ (అంబీర్) చెరువు దుర్గంధ భరితంగా మారిపోయింది. వ్యర్థాల డంపింగ్ యార్డుగా తయారై ఆహ్లాదం ఆనవాళ్లు లేకుండా తయారయ్యింది. ఇప్పుడా చెరువును పరిరక్షించేందుకు హైడ్రా నడుం బిగించింది. ఆహ్లాదం ఆవిరై.. దుర్గంధ భరితంగా మారిన చెరువును కాపాడేందుకు రంగంలోకి దిగింది. చెరువు ఒడ్డున పేరుకు పోయిన వ్యర్థాలను తొలగించడం ప్రారంభించింది. ఇప్పటికే 30 ట్రక్కుల చెత్తను తొలగించింది. మరో 30 ట్రక్కుల వరకూ ఉంటుందని అంచనా వేసింది. ఒకటి రెండు రోజుల్లో మొత్తం అక్కడి వ్యర్థాలను తొలగించడానికి ఏర్పాట్లు చేసింది. కూకట్‌పల్లి – ప్రగతినగర్‌లను కలుపుతూ ప్రగతినగర్ చెరువు మధ్యలోంచి వేసిన రోడ్డుకు ఇరువైపులా వ్యర్థాలను తొలగించి.. భవిష్యత్తులో అక్కడ చెత్త వేయడానికి వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైడ్రా నిర్ణయించింది.
169 ఎకరాల వరకూ ఉండే ప్రగతినగర్ చెరువు ఆహ్లాదకర వాతావరణాన్ని అనుభవించిన స్థానికులు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆవేదన చెందారు. చెరువు మధ్యలో ఉన్న రోడ్డు పొడవునా చికెన్, మాంసం, చేపల విక్రేతలు వ్యర్థాలను పడేస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. జంతు వ్యర్థాలను ఇలా డంప్ చేయడం వల్ల దుర్వాసన, నీటి వనరు కాలుష్యం ఏర్పడింది. ఫర్ ఏ బెటర్ సొసైటీ ప్రతినిధులు కూడా ఈ చెరువు పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తోంది. ఈ చెరువును కబ్జాల నుంచి కాపాడడంతో పాటు.. పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని వీరంతా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను ఆశ్రయించారు. నగరంలో చెరువుల అభివృద్ధిని ఇప్పటికే ప్రారంభించిన హైడ్రా.. స్థానికుల విజ్ఞప్తి మేరకు ప్రగతినగర్ చెరువు ప్రగతిపై దృష్టి పెట్టింది.



















