హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్. సోమవారం గాంధీ భవన్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ , జూపల్లి కృష్ణారావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మీరు మా తోలు తీసుడు కాదు కవితమ్మ మీ తోలు తీస్తుందన్నారు. చాప్టర్ 1,2 అంటూ మీ తోలు తీసేందుకు రెడీ అయ్యిందన్నారు. ఆ తోలుకి ముందు పాచెస్ వేసుకోండి అంటూ హితవు పలికారు. గత 10 ఏళ్ల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్ధ 9 ఏళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద ఎందుకు పెట్టలేదంటూ ప్రశ్నించారు వాకిటి శ్రీహరి.
ఈ జిల్లాపై ఎందుకు అంత కక్ష అంటూ నిలదీశారు సీఎం కేసీఆర్ పై. ఇక నుంచైనా కపట ప్రేమను కురిపించడం ఆపాలని సూచించారు మంత్రి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుని జాతికి అంకితం చేశాం అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అందుకే కదా మొన్న ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారని అయినా ఇంకా సోయి లేకుండా మాట్లాడటం దారుణమన్నారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా సేమ్ ఇవే డైలాగులు కొట్టాడని, జనం ఛీ కొట్టారని అయినా బుద్ది రాలేదన్నారు వాకిటి శ్రీహరి. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఉప ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పుష్పం వాడి పోయిందన్నారు.



















