అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. హామీ ఇచ్చిన 9 రోజుల్లోనే 25 కంప్యూటర్లు, లైబ్రరీ నిండుగా పుస్తకాలు సమకూర్చారు. చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ 2.0కి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్కూల్లో అందుబాటులో ఉన్న లైబ్రరీ, ల్యాబ్, పాఠశాల గదులను పరిశీలించారు. పాఠశాలలో పుస్తకాలు అరకొరగా ఉండడాన్ని గమనించిన ఆయన లైబ్రరీ నిండుగా పుస్తకాలు, కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కేవలం కొన్ని రోజుల్లోనే సమకూర్చడం విశేషం. కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయించారు.
లైబ్రరీని పుస్తకాలతో నింపేశారు. చిన్నారుల కోసం పెద్ద బాలశిక్ష నుంచి కాశీమజిలీ కథల వరకు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు, బహుభాషా ప్రావీణ్యాన్ని పెంచే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్, హిందీతో పాటు తమిళం, కన్నడ, ఒడియా తదితర భాషల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. సుమారు రూ. 25 లక్షలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేయించారు. చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, మాజీ శాసన సభ్యులు కిలారి రోశయ్య, కూటమి నాయకులు కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను ప్రారంభించి విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చారు.
















