అమరావతి : రాష్ట్రంలో హస్త కళల అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పీఏసీ సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్. వనిపెంట గ్రామంలో, బ్రాస్ , బెల్ మెటల్ కళలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ‘గురు–శిష్య హస్తశిల్ప్ ప్రశిక్షణ కార్యక్రమం’ (GSHPP)ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. హస్తకళలు మన సంస్కృతి, వారసత్వానికి ప్రతిరూపమని అన్నారు. వాటిని సంరక్షించే బాధ్యత సర్కార్ తో పాటు సమాజంపై కూడా ఉందన్నారు హరి ప్రసాద్. హస్తకళలను పునరుద్ధరించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, కళాకారుల నైపుణ్యానికి తగిన గుర్తింపు ఇవ్వడం, మార్కెట్ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా హస్తకళల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ హస్తకళా కార్పొరేషన్ ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ (ODOP) పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు హరి ప్రసాద్. మొత్తం 36 హస్తకళా ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. మార్కెటింగ్, ప్రచారం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో కార్పొరేషన్ కీలక సహాయం అందిస్తోందని ఆయన తెలిపారు. వనిపెంట గ్రామంలో తరతరాలుగా బ్రాస్ , బెల్ మెటల్ వస్తువుల తయారీలో నిమగ్నమై ఉన్న కళాకారుల కోసం 11.1 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కామన్ ఫెసిలిటీ సర్వీస్ సెంటర్ (CFSC) ఆధునిక వసతులను అందిస్తూ, కళాకారుల పనిసామర్థ్యాన్ని మరింత పెంచుతోందని హరిప్రసాద్ స్పష్టం చేశారు.
















