హైదరాబాద్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పదే పదే ఇంగ్లీష్ భాషపై తనకు పట్టు లేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇంగ్లీష్ రాకున్నా ఏమీ కాదని పేర్కొన్నారు. సమాజంలో ఇంగ్లీష్ రాకుంటే వారిని చిన్న చూపు చూసే సంస్కృతి ఉందన్నారు. దీనిని తాను ఒప్పుకోనని చెప్పారు. తాను పల్లె నుంచి వచ్చానని, సర్కార్ బడిలో చదువుకున్నానని అన్నారు సీఎం. నాకు ఇంగ్లీష్ రాక పోయినా రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్నానని స్పష్టం చేశారు. పాలన వేరు భాష వేరు అని అన్నారు. మోదీకి కూడా ఇంగ్లీష్ రాదన్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చాక భాష అనేది అవరోధం కాదన్నారు. ఎవరైనా తమకు నచ్చిన భాషలో మాట్లాడే ఛాన్స్ ఉందన్నారు.
తెలంగాణలో విద్యార్థుల కంటే పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయంటూ బాంబు పేల్చారు. రాష్ట్రంలో
25 లక్షలకు పైగా పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. అందులో 18 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారని , మిగతా వారు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. వేలకు వేలు జీతాలు చెల్లిస్తున్నా ఎందుకని హాజరు శాతం పెరగడం లేదని ప్రశ్నించారు. 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకుంటానని, వాళ్ళతోనే మాట్లాడిస్తానంటూ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. చైనా సప్లైస్ ఆపితే ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా ఒక గంట కూడా బ్రతక లేదన్నారు. చైనా వాడు నా అప్పు మొత్తం కట్టు అని అమెరికా వాడిని వంగబెట్టి బండ పెడితే, వాడు మొత్తం అమెరికాను చైనాకు అప్పగించాల్సి వస్తుందన్నారు.
















