హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో అవకాశాలను వివరించడం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే దీని ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సమ్మిట్ లో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలి వస్తుండడం విశేషం. 8న సోమవారం మధ్నాహ్నం ఒకటిన్నరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ ను ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు.
సమ్మిట్ లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, తదితరులు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వంవైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్దం చేశారు.
వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిధులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్దంచేశారు. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీ తో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రాజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్ లో ఎల్ఈడీ స్క్రీన్స్ తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి.

















