అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ కూటమి సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హామీల పేరుతో అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిగూడెంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ వాపోయారు. తమ సర్కార్ హయాంలో రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశామన్నారు. ఏ ఒక్కరూ పంటలు నష్ట పోకుండా బీమా సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. కానీ చంద్రబాబు పాలనలో వారిని గాలికి వదిలి వేశారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఉన్నప్పటికీ కేవలం 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంటల బీమా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, అంతే కాకుండా విపత్తుల సమయంలో సకాలంలో సహాయం అందించడంలో విఫలమైందని జగన్ ఆరోపించారు . ఎన్డీయే 19 నెలల పాలనలో ఏపీ రాష్ట్రం 17 ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొందని చెప్పారు. మొత్తం 84 లక్షల మంది రైతులకు పంటల బీమా వర్తింప చేయాల్సి ఉండగా కేవలం 19 లక్షల మంది రైతులకే వర్తింప చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా అవసరమైన వారిని ఆదుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు జగన్ మోహన్ రెడ్డి. అంతే కాకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు ఆలస్యం అయ్యాయని పేర్కొన్నారు. కౌలు రైతులు దయనీయ స్థితిలో మిగిలి పోయారని పేర్కొన్నారు. పండుగలా జరుపు కోవాల్సిన వ్యవసాయం చంద్రబాబు నాయుడు పాలనలో మరింత భారంగా మారిందన్నారు.

















