కరీంనగర్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల్లో మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ లో భాగంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.
హుస్నాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత పదేళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన గౌరెల్లి రిజర్వాయర్ పనులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు రేవంత్ రెడ్డి. గడీలు, పెత్తందార్లకు వ్యతిరేకంగా సర్దార్ పాపన్న గౌడ్ నాయకత్వంలో బహుజనుల రాజ్య స్థాపనకు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టారని ఆ ప్రాంత ప్రాధాన్యతను గుర్తు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా అండగా నిలిచిన తీరు, సోనియా గాంధీ ఇచ్చిన మాట, తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలని తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారన్నారు.
