వ‌రంగ‌ల్ పీఎం మిత్ర పార్క్ ద్వారా 3 ల‌క్ష‌ల జాబ్స్

లోక్ స‌భ‌లో వెల్ల‌డించిన మోదీ కేంద్ర ప్ర‌భుత్వం

hellotelugu-WarangalPMMitra

న్యూఢిల్లీ : వరంగల్‌లోని ప్ర‌ధాన‌మంత్రి మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఒక లక్ష ప్రత్యక్ష, రెండు లక్షల పరోక్ష ఉద్యోగ అవకాశాలతో సహా మొత్తం మూడు లక్షల వరకు ఉద్యోగాలను కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. మే 10న హైదరాబాద్ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘కాకతీయ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపారెల్ పార్క్’ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. లోక్‌సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలను అందించారు. ఈ పార్క్ ద్వారా భారీ ఎత్తున జాబ్స్ ల‌భిస్తాయ‌ని తెలిపారు. ఇప్పటికే వచ్చిన పెట్టుబడి హామీల ద్వారా 24,400కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశామ‌న్నారు.

2021–22 నుండి 2027–28 వరకు అమలు చేయబడుతున్న పథకం కింద రూ . 4,445 కోట్ల కేటాయింపుతో దేశవ్యాప్తంగా ఏడు పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపారెల్ పార్కులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ఏడు ప్రాంతాలలో వరంగల్ ఒకటి. ఇది ‘బ్రౌన్‌ఫీల్డ్’ (అప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే) విభాగం కింద ఎంపిక చేయబడింది. వరంగల్ పీఎం మిత్ర‌ పార్క్‌లో ప్రధాన మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే రూ. 300 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం తెలిపింది. కొన్ని యూనిట్లలో వాణిజ్య ఉత్పత్తి కూడా ప్రారంభమైందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పార్క్‌లో పెట్టుబడిదారులకు ఇప్పటికే సుమారు 548 ఎకరాల భూమిని కేటాయించామ‌న్నారు. వస్త్ర , దుస్తుల తయారీ రంగానికి సంబంధించి ఒకే ప్రాంతంలో సమగ్రమైన , ఆధునిక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించడమే పీఎం మిత్ర పార్కుల ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి.

Exit mobile version