చెన్నై : తమిళనాడు టీవీకే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్కార్ ఆదేశాల మేరకు తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను తీపి కబురు చెప్పింది. ఇందులో భాగంగా స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా వివిధ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రద్దీ కొనసాగుతుంది. ఈ రద్దీ దృష్ట్యా 1,900 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. శనివారం నాడు స్వాతంత్ర దినోత్సవం వస్తుండటంతో చెన్నై, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి ప్రయాణికులు తమ సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం ఉన్నందున ఈ ప్రత్యేక బస్సు సేవలను ఏర్పాటు చేశారు. చెన్నైలోని కిలంబక్కం బస్సు టెర్మినస్ నుండి ఆగస్టు 14న 505 ప్రత్యేక బస్సులు, ఆగస్టు 15న మరో 570 బస్సులు నడపనున్నారు.
తిరువణ్ణామలై, తిరుచిరాపల్లి, కుంభకోణం, మదురై, తిరునెల్వేలి, నాగర్‌కోయిల్, కన్యాకుమారి, తూత్తుకుడి, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్ , తిరుప్పూర్ వంటి ప్రాంతాలకు నడపనున్నట్లు ప్రకటించింది తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ. కోయంబేడు నుండి తిరువణ్ణామలై, నాగపట్నం, వేళంకన్ని, హోసూర్ మరియు బెంగళూరులకు ఆగస్టు 14 , 15 తేదీలలో ప్రతిరోజూ 110 బస్సులు నడపబడతాయి. మాధవరం నుండి ఆగస్టు 14 , 15 తేదీలలో ప్రతిరోజూ 80 బస్సులు నడపబడతాయి; అలాగే బెంగళూరు, తిరుప్పూర్, ఈరోడ్ , కోయంబత్తూరు నుండి వివిధ ప్రాంతాలకు ఈ మూడు రోజుల్లో మొత్తం 200 బస్సులు నడపబడతాయి. ఆదివారం నాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి చెన్నైకి మొత్తం 465 బస్సులు నడుస్తాయని తెలిపారు.
