ఢిల్లీ : భారత జట్టు మాజీ క్రికెటర్, ఎంపీ హర్బజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇండియా, శ్రీలంక సంయుక్తంగా వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరిలో నిర్వహించ బోయే ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఎవరూ ఊహించని రీతిలో వైస్ కెప్టెన్ గా ఉన్న , జట్టుకు గత కొంత కాలంగా భారంగా మారిన శుభ్ మన్ గిల్ తో పాటు హర్షిత్ రాణా, జితేష్ శర్మలపై వేటు వేసింది. ఈ సందర్బంగా దేశీవాళి టోర్నమెంట్ లలో దుమ్ము రేపుతూ అద్బుతంగా పర్ ఫార్మెన్స్ కనబరుస్తూ వచ్చిన స్టార్ క్రికెటర్లు సంజూ శాంసన్ , రింకూ సింగ్, ఇషాన్ కిషన్ లకు చోటు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు భజ్జీ అలియాస్ హర్భజన్ సింగ్.
ప్రస్తుతం ఎంపికలో పూర్తి పారదర్శకత కనిపించిందని, కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు జట్టును చూస్తే అర్థం అవుతుందన్నాడు. ఆదివారం హర్భజన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఛాంపియన్ గా ఉన్న భారత జట్టు ఇప్పుడు మరోసారి కప్ ను తీసుకు వచ్చేలా ఆడుతుందని , ఆ నమ్మకం తనకు ఉందన్నాడు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ఇండియా మరింత బలంగా ఉందని, ఇది ప్రత్యర్థి జట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా స్వదేశంలో జరిగిన టి20 సీరీస్ ను గెలుపొందింది టీమిండియా. ఈ సందర్బంగా దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ లో ఇండియా, సఫారీ జట్లు ఆడతాయని జోష్యం చెప్పాడు.
