అమరావతి : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలో సిఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత ఆర్అండ్ఆర్ పరిహారం కింద కింద చెక్కులను పంపిణీ చేశారు .1600 మంది నిర్వాసితులకు 200 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఇప్పటికే మొదటి విడతలో 2,560 నిర్వాసిత కుటుంబాలకు రూ.318 కోట్ల పరిహారం పంపిణీ చేశారు సిఎం .మిగిలిన నిర్వాసిత కుటుంబాలందరికీ ఈనెలలోనే పరిహారం అందించాలని చంద్రబాబు ఆర్దిక శాఖను ఆదేశించారు. నిర్వాసితుల నుంచి వస్తున్న గ్రీవెన్సులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
అర్హులై ఉండి పరిహారం జాబితాలో పేర్లు లేకపోవడం, గెజిట్ నోటిఫికేషన్‌లో పేరు ఉన్నప్పటికీ అవార్డు పాస్ కాకపోవడం వంటి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వెలుగొండ నిర్వాసితుల 11 గ్రామాల్లో 11 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. నిజమైన అర్హత ఉన్న, ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం అన్నారు. నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 7 కాలనీల్లో, 4 కాలనీలకు సంబంధించిన మౌళిక వసతుల పనులు 100 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
మిగిలిన 3 కాలనీల్లో ఉన్న బ్యాలెన్స్ పనులను కూడా రోజువారీగా సమీక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్దిక పరిస్దితి వెంటిలేటర్ మీద ఉన్నా, వెలుగొండ ప్రాజెక్టుకు కేవలం రెండేళ్లలోనే దాదాపు రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కరువు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతమైన ప్రకాశం జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలన్న చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా వెలుగొండ పనులను వేగవంతం చేశాం అన్నారు. .
