హైదరాబాద్ : ఫేక్ (నకిలీ) ఫైర్ ఎన్‌వోసీల విషయాన్ని హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. ఇప్పటికే ఇంటర్ బోర్డుకు లేఖ రాసి వివరాలు తీసుకుంది. గత జూలై నెల 4వ తేదీన ఇందుకు సంబంధించి లేక్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. జూనియర్ కళాశాలల యాజమాన్యాలు సమర్పించిన నకిలీ/ఫోర్జరీ ఫైర్ ఎన్‌వోసీలపై విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వ్యాపార సముదాయాల నిర్వాహకులతో సమావేశం కూడా ఏర్పాటు చేసి ఎన్‌వోసీపై మార్గదర్శకం చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిలో 142 జూనియర్ కళాశాలలు ఫైర్ ఎన్‌వోసీలు సమర్పించగా అందులో 90 వరకు ఒరిజనల్ వి ఉండగా 52 ధ్రువపత్రాలు నకిలీవని తేలిందన్నారు.
ఈ నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై తదుపరి చర్యలకు ఉద్దేశించి నెక్లెస్ రోడ్డులోని లేక్ పోలీసు స్టేషన్లో కేసు కూడా హైడ్రా నమోదు చేసింది. 2025–26, 2026–27 విద్యా సంవత్సరాలకు సంబంధించి జూనియర్ కళాశాలల యాజమాన్యాలు సమర్పించిన ఫైర్ ఎన్‌వోసీల ప్రతులన్నిటినీ హైడ్రా పరిశీలిస్తోంది. మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు మొత్తం 76 ఫైర్ ఎన్‌వోసీలను ప్రామాణికత నిర్ధారణ కోసం పంపించారు. వాటిని హైడ్రా కార్యాలయ రికార్డులతో పరిశీలించగా ఇందులో 7 ఫైర్ ఎన్‌వోసీలు నకిలీ/ఫోర్జరీ వని తేలింది. రెండో దశలో సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు మొత్తం 66 ఫైర్ ఎన్‌వోసీలను ధృవీకరణ కోసం పంపించారు. వీటిని కూడా హైడ్రా కార్యాలయ రికార్డులతో పరిశీలించగా, 45 ఫైర్ ఎన్‌వోసీలు నకిలీ/ఫోర్జరీ చేసినవిగా తేలింది. ఈ మేరకు ఆయా కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా స్పష్టం చేసింది.
