శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత.
తన ప్రోద్బలంతోనే వైసీపీ గూండాలు రెచ్చి పోతున్నారని, పండగపూట తుని, పల్నాడులో జరిగిన హత్యలకు ఆయన వ్యాఖ్యలే కారణమని ఆరోపించారు. సంక్రాంతి పండుగను ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకుంటుంటే, వైసీపీ గూండాలు మాత్రం రప్పా…రప్పా…అంటూ రాష్ట్రంలో దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. పల్నాడులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను కూలాలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. తుని నియోజక వర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, బీసీ నేత లాలం బంగారయ్యను అతి కిరాతికంగా హత్య చేశారన్నారు. దాడులకు, హత్యలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని మంత్రి హెచ్చరించారు.
పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. అధికారం కోల్పోవడంతో జగన్ రెడ్డికి మతి భ్రమించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని, ప్రజలు ఆనందోత్సవాలతో సంక్రాంతి జరుపుకోవడాన్ని చూసి ఓర్వలేక పోతున్నాడన్నారు. హత్యా రాజకీయాలకు, శవ రాజకీయాలకు తెర లేపి, వైసీపీ గూండాలతో రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కుట్ర పన్నాడని జగన్ పై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా, రప్పా… రప్పా…అని బెదిరించినా రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని మరింత పరుగులు పెట్టిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు.
