కర్నూలు జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాయలసీమ ఇక నుంచి రతనాల సీమగా మారి పోనుందని అన్నారు. బుధవారం జొన్నగిరిలో గోల్డ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బంగారం ఎక్కడికో తరలించి ఆభరణాలు తయారు చేసే బదులు ఇక్కడే ఓ జ్యుయలరీ పార్కు కూడా ఏర్పాటు చేస్తాం అని వెల్లడించారు. ఈ పరిశ్రమకు అనుమతులు ఇవ్వడంతో పాటు భారీ భద్రత కూడా కల్పిస్తాం అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ మాత్రమే కాదు…ఆంధ్రప్రదేశ్ అంటే రత్నగర్భ కూడా అని చెప్పారు. మన రాష్ట్రంలో పండని పంటలు లేవు… దొరకని ఖనిజాలు లేవు అన్నారు. మంగంపేట బెరైటీస్, కడప లైమ్ స్టోన్, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఉందన్నారు ముఖ్యమంత్రి. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్, కుప్పంలో గ్రీన్ గ్రానైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రానైట్ లభిస్తుందన్నారు.
గూడూరు మైకా, నెల్లూరు సిలికా, ఉత్తరాంధ్ర తీరంలో బీచ్ శాండ్ తతో పాటు అనంతపురం, కడపలో ఐరన్ ఓర్….కేజీ బేసిన్ లో గ్యాస్, పెట్రోల్ లభిస్తుందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.వీటిని సద్వినియోగం చేసుకునేందుకు వాల్యూ ఎడిషన్ పరిశ్రలను ప్రోత్సహిస్తున్నాం అన్నారు. సిమెంటు, స్టీల్ పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయని అన్నారు. ఈ గనులు, వచ్చే పరిశ్రమలతో ఇక్కడి యువతకు ఇక్కడే ఉపాధి కల్పిస్తామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీ ఓ మోడల్ గా మార బోతోందన్నారు. గత పాలకులు అక్రమ సంపాదన కోసం పరిశ్రమల్ని బయటకు తరిమేశారని ఆరోపించారు. కేవలం ఎన్డీఏ ప్రభుత్వ బ్రాండ్ తోనే పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని అన్నారు.
సీమలో ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తున్నాం. స్పేస్, ఏరో స్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, స్టీల్, సిమెంట్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. కర్నూలు జిల్లాలో దేశంలో అతిపెద్ద డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు సీఎం. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను తీసుకువస్తాం అని వెల్లడించారు.
