విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ, కూటమి పార్టీలు రావణ కాష్టంలా మార్చాయని ఆరోపించారు. శనివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు. ప్రజలు వీరిని , వీరి రాజకీయాలను చూసి ఈసడించు కుంటున్నారని అయినా బుద్ది రావడం లేదన్నారు. ఎన్నికల వేళ టీడీపీ , వైసీపీలు సాగిస్తున్నది దాష్టీక రాజకీయాలు చేస్తున్నాయని , వీరి నిర్వాకం కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు షర్మిలా రెడ్డి.
నాడు జగన్ రెడ్డి హయాంలో హింసాకాండ.. నేడు టీడీపీ చంద్రబాబు పాలనలో పోటీ పడి హింసాత్మక కార్యక్రమాలకు తెర తీశారని ఆరోపించారు. ప్రతీకార రాజకీయాలతో రతనాల సీమను రక్తసీమగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి. నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఘర్షణలు, దాడులతో రణరంగంగా మారుస్తున్నారని మండిపడ్డారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను మరో ‘సౌత్ బీహార్’గా మార్చే పరిస్థితులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు . నిన్న రాయచోటి, పుంగనూరులో చోటుచేసుకున్న ఘటనలు రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఆందోళనకరమైన పరిణామాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు రాజకీయాలకు, రక్తపాతానికి తావులేదన్నారు.
రాజకీయాలంటే ప్రజల అభివృద్ధి కోసం పోటీ పడాలి కానీ, భౌతిక దాడులకు పాల్పడటం కాదన్నారు.
అధికారాన్ని అడ్డుపెట్టి టీడీపీ సాగిస్తున్న ఈ దౌర్జన్య వైఖరిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కూటమిది నిజంగా పవిత్ర పాలనే అయితే, దాడులు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు . బలవంతపు ఏకగ్రీవాలు ఎందుకు? నామినేషన్లు వేయకుండా అడ్డు కోవడమెందుకు? అని నిలదీశారు. ఐదు అంచెల భద్రత ఉండాల్సిన నామినేషన్ కేంద్రాల వద్ద కిరాయి రౌడీలు, గూండాలు స్వైరవిహారం చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖ బాధ్యత ఏమైంది? ఎక్కడికి పోయిందన్నారు షర్మిలా రెడ్డి.


















