విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ కొలువు తీరి రాష్ట్రంలో రెండు సంవత్సరాలు అయ్యిందని, ఇప్పటి వరకు ఇచ్చిన హామీలలో చాలా మటుకు నెరవేర్చ లేదన్నారు. రైతులను ఆదుకోవడంలో, కనీస మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు. ప్రతి ఏటా జనవరి వస్తోంది పోతోందంటూ ఎద్దేవా చేశారు షర్మిలా రెడ్డి. సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నా ఫస్ట్ తారీఖున ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ కి మాత్రం దిక్కు లేకుండా పోయిందంటూ మండిపడ్డారు.
హామీలు ఇవ్వడంలో, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయడంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును మించిన నాయకుడు ఈ దేశంలో లేరంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డు చేసి పెట్టుకోండని ఇచ్చిన వాగ్దానానికి విలువ లేకుండా పోయిందన్నారు షర్మిలా రెడ్డి. ఉద్యోగాల పేరుతో ఆశ చూపి, భారీగా నిరుద్యోగుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. రెండో ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ పై కనీసం మాట మాత్రంగానైనా ప్రస్తావించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు షర్మిలా రెడ్డి. వారి జీవితాలతో చెలగాటం ఆడేందుకు కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
