చెన్నై : తమిళనాడులో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రత్యేకించ 15 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఇంకా చురుకుగా ఉండటంతో ఆదివారం నుండి తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రధానంగా చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట, తిరువణ్ణామలై, కాంచీపురం , చెంగల్పట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సమాచారం సూచిస్తోంది. అలాగే నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్, తేని, దిండిగల్, మధురై, కన్యాకుమారి జిల్లాలతో పాటు విరుదునగర్, తెన్‌కాసి , తిరునెల్వేలి జిల్లాలలోని ఘాట్ ప్రాంతాల్లో కూడా ఆదివారం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్‌లో పేర్కొంది.
జూన్ 29 నుండి నైరుతి బంగాళాఖాతం , దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అలాగే, నాగపట్నం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కరైకాల్ , రామనాథపురం తీర ప్రాంతాల్లో సముద్ర ప్రవాహాల విషయంలో వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది; ఓడరేవు ,సముద్ర కార్యకలాపాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శనివారం నుండి జూన్ 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి , కరైకాల్ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దగ్గరగా ఉంటాయని ఆ నివేదిక పేర్కొంది. చెన్నై , దాని శివారు ప్రాంతాల విషయానికొస్తే, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదిక తెలిపింది.
