నెల్లూరు జిల్లా : కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రధాని మోదీ కుట్రకు తెర లేపారని అందులో బాగంగానే చట్టంలో మార్పులు తీసుకు వచ్చారంటూ ఆరోపించారు. అందుకే మన్రేగా చట్టాన్ని మార్చి కొత్త చట్టం తెచ్చారంటూ మండిపడ్డారు. గురువారం తాను చేపట్టిన జాతీయ ఉపాధి పరిరక్షణ యాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్బంగా ప్రసంగించారు షర్మిలా రెడ్డి. బీజేపీ తెచ్చిన కొత్త చట్టం VB G RAM G అక్రమ చట్టం అని ఆరోపించారు. మన్రెగా చట్టంలో పని హక్కు గ్రామ సభలది అని అన్నారు షర్మిలా రెడ్డి. మోదీ చట్టం లో పని హక్కును గ్రామ సభల నుంచి తొలగించారని ఆరోపించారు.
ఇకపై ఉపాధి హామీ పథకాన్ని కాంట్రాక్టర్ల చేతిలో పెట్టాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు. ఉపాధి హామీ శ్రామికులను కాంట్రాక్టర్లకు లేబర్ సప్లై కింద పంపాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ తెచ్చిన గ్రామ్ జి చట్టం రాష్ట్రాలకు భారం కానుందన్నారు. రాష్ట్రం నెత్తిన ఏడాదికి 5 వేల కోట్ల భారం పడిందన్నారు. ఇప్పటికే ఏపీ 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందంటూ పేర్కొన్నారు. అప్పుల రాష్ట్రానికి ఏడాదికి 5 వేల కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. చట్టానికి మద్దతు ఇచ్చి మోడీ దగ్గర నిధులు ఇవ్వాలని ఎందుకు దేహి అంటున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ లను ప్రశ్నించారు షర్మిలా రెడ్డి.


















