విజయవాడ : సత్యం ఎప్పటికీ నిలిచే ఉంటుందని గురువారం ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైందని అన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. నేషనల్ హెరాల్డ్ అక్రమ కేసుపై ఢిల్లీ కోర్టు పెట్టిన చివాట్లు ప్రధాని మోడీకి, బీజేపీ నీచాతి నీచ రాజకీయాలకు చెంపపెట్టు లాంటిదన్నారు. ఇవాళ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు విజయవాడలో. ధర్మపీఠం ముందు ప్రతీకారానికి చోటు లేదని నిరూపణ జరిగిందని చెప్పారు. కక్ష్ సాధింపు రాజకీయాలకు స్థానం లేదని తేటతెల్లం అయ్యిందన్నారు. ఆకాశం లాంటి కాంగ్రెస్ పార్టీపై ఏదో వేయాలని చూస్తే చివరకది మోడీ మొహం మీదే పడిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను బానిసగా చేసుకుని కాంగ్రెస్ అధినాయకత్వంపై బురద చల్లాలని చూసినా, గాంధీ కుటుంబాన్ని వేధించాలని కుట్రలు పన్నినా అంతిమంగా న్యాయమే గెలిచిందని చెప్పారు.
వ్యవస్థలను సొంతానికి వాడుకుంటున్నట్లు మరోసారి వాస్తవం రుజువైందని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఇది అధర్మం అంతానికి, మోడీ నిరంకుశత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను దుర్వినియోగం చేసినందుకు, కాంగ్రెస్ పార్టీపై అపఖ్యాతి మోపాలని చూసినందుకు తక్షణమే పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఇంకా సిగ్గు, శరం అనేది ఉంటే మోదీ, అమిత్ షాలు దిగి పోవాలని అన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు ఏనాడూ చెల్లవని మరోసారి ఈ తీర్పుతో స్పష్టమై పోయిందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
