టెహ్రాన్: మధ్యప్రాచ్య యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో కుదిరిన ఒప్పందంపై వాషింగ్టన్‌తో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగనున్నాయని టెహ్రాన్ ఖండించినప్పటికీ ఖతార్‌లో సమావేశం కావాలని ఇరాన్ అభ్యర్థించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరిన తర్వాత హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్ ఒమన్‌తో తొలి చర్చలు జరిపిన అనంతరం ఒప్పందాన్ని దెబ్బతీస్తున్న తమ దాడులను నిలిపి వేయడానికి వాషింగ్టన్, టెహ్రాన్‌లు అంగీకరించిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది . ఇరాన్ ఒక సమావేశాన్ని అభ్యర్థించింది. అది ఇవాళ దోహాలో జరుగుతుంది అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు, కానీ సమావేశంలో పాల్గొనేవారి వివరాలను పేర్కొనలేదు.
వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ తరువాత మీడియాతో మాట్లాడుతూ అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ , ట్రంప్ సలహాదారు, అల్లుడు జారెడ్ కుష్నర్ ఈ వారం ఉన్నత స్థాయి సమావేశాల కోసం దోహాకు వెళ్లనున్నారు అని చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ మాట్లాడుతూ, తమ దేశానికి చెందిన నిపుణుల బృందం ఈ వారం దోహాకు వెళ్తుందని, అయితే అమెరికన్లతో ఎలాంటి సమావేశాలు జరగ లేదని గట్టిగా ఖండించారు.
మేము ఇంకా తుది ఒప్పందంపై చర్చలు జరిపే దశలోకి ప్రవేశించలేదు అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో, మేము ఏ స్థాయిలోనూ అమెరికా పక్షంతో ఎలాంటి చర్చల సమావేశాలు జరపమని కుండలు బద్దలు కొట్టారు. అత్యంత వ్యూహాత్మకమైన ఈ జలసంధిపై ఇరాన్ నియంత్రణ సాధించడం పదేపదే ఉద్రిక్తతలకు దారితీసింది. వాణిజ్య నౌకలపై ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ”కు నిరసనగా 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్స్ ప్రకటించడంతో ఈ ఉద్రిక్తతలు తాజాగా చోటు చేసుకున్నాయి.
