కర్నూలు జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆనాడు యూపీఏ హయాంలో తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కావాలని మోదీ సర్కార్ నిర్వీర్యం చేసేలా చట్టాన్ని తీసుకు వచ్చిందని ఆరోపించారు. దీని వల్ల దేశంలో కోట్లాది మంది పేదలు, నిరుపేదలు, కూలీలకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర పలు జిల్లాల్లో కొనసాగింది. ఇవాళ ఈ యాత్ర కర్నూలు జిల్లాకు చేరుకుంది.
కోడుమూరు నియోజకవర్గం గార్గేయపురంలో జరిగిన బహిరంగ సభకు స్థానిక ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేద ప్రజల పొట్టగొట్టే VB G – RAM G చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మన్రేగా చట్టాన్ని పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి కోడుమూరు ప్రజలు మద్దతు పలకడం సంతోషంగా ఉందన్నారు. గార్గేయ పురంలో జరిగిన సభకు CWC సభ్యులు కొప్పుల రాజు సైతం హాజరయ్యారు.
ఇదే సమయంలో ఏపీ సర్కార్ తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2026-27 పై కూడా నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిలా రెడ్డి. కేవలం పెట్టుబడిదారులకు మేలు చేకూర్చేలా , కార్పొరేట్ కంపెనీలకు లాభం కలిగేలా బడ్జట్ ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలి వేశారంటూ ధ్వజమెత్తారు షర్మిలా రెడ్డి.
