అమరావతి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇంఛార్జి గొట్టిపాటి రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై. రాష్ట్రంలో రఫ్పా రఫ్పా అంటూ శవ రాజకీయాలకు తెర లేపారంటూ మండిపడ్డారు. ఇక నుంచి ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను కులాలకు ఆపాదించడం దారుణమన్నారు. కుళ్లు రాజకీయాలకు ముందు నుంచి జగన్ ప్రోత్సహిస్తూ వస్తున్నాడని మండిపడ్డారు. సోమవారం గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని చెప్పారు. ఆ విషయం మరిచి పోయి సోయి లేకుండా జగన్ మాట్లాడటం దారుణమన్నారు.
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు గొట్టిపాటి రవికుమార్. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కి జగన్ నేతృత్వంలోని వైసీపీ కి మధ్య ఉన్న తేడా ప్రజలకు బాగా తెలుసు అని అన్నారు. అరాచకాలకు పాల్పడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను దెబ్బ తీసేందుకు వైసీపీ గూండాలు ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు గొట్టిపాటి రవికుమార్. గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పని చేసే లక్ష్యం తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. ప్రజలు 11సీట్లకు పరిమితం చేసినా వైసీపీకి బుద్ది రాలేదన్నారు మంత్రి. ఎక్కడ ఎవరు చనిపోయినా శవ రాజకీయాల కోసం పాకులాడుతూ ప్రజల్ని మభ్య పెట్టాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు.
