బీజేపీని చూస్తే ఆర్ఎస్ఎస్ అర్థం కాదు

ఆర్ఎస్ఎస్ అధిప‌తి మోహ‌న్ భ‌గ‌వత్

hellotelugu-MohanBhagwat

భోపాల్ : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ అధిప‌తి మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని భోపాల్ లో మీడియాతో మాట్లాడారు. భార‌తీయ జ‌న‌తా పార్టీని చూసి ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోలేర‌ని పేర్కొన్నారు. చాలా మంది ఆర్ఎస్ఎస్ జ‌న్ సంఘ్ , దాని వారుసులైన బీజేపీకి మాతృ సంస్థ‌గా భావిస్తార‌ని తెలిపారు. ఆర్ఎస్ఎస్ కు ప్ర‌త్యేక‌మైన యూనిఫాం, నిరంత‌రం యోగా, వ్యాయామాలు చేస్తున్న‌ప్పటికీ పారా మిలిట‌రీ సంస్థ కాద‌న్నారు. అంతే కాకుండా బీజేపీని చూసి త‌మ సంస్థ‌ను అర్థం చేసుకోవాల‌ని అనుకోవ‌డం పొర‌పాటు అని పేర్కొన్నారు మోహ‌న్ భ‌గ‌వ‌త్.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమాజాన్ని ఏకం చేయడానికి ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని చెప్పారు. భారతదేశం మళ్లీ ఏ విదేశీ శక్తి చేతిలో చిక్కుకోకుండా ఉండేందుకు అవసరమైన లక్షణాలు , సద్గుణాలను సమాజంలో నింపడానికి కృషి చేస్తుందని స్ప‌ష్టం చేశారు ఆర్ఎస్ఎస్ అధిప‌తి. ఆర్ఎస్ఎస్ ప్ర‌త్యేక‌మైన సంస్థ అని, దానిని అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నారు. విద్యా భార‌తిని చూసి కూడా మీరు అర్థం చేసుకోవాల‌ని అనుకోవ‌డం కూడా త‌ప్పేన‌న్నారు. త‌మ గురించి, సంస్థ గురించి విస్తృతంగా వెతుకుతారు. కానీ ఎక్క‌డా అస‌లైన లేదా వాస్త‌వ స‌మాచారం లేద‌న్నారు. ప్ర‌తిసారి త‌మ‌ను, సంస్థ‌ను ల‌క్ష్యంగా చేసుకుని కొంద‌రు ప‌దే ప‌దే మాట్లాడ‌టం ప‌ట్ల ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఏదైనా , లేదా ఏ సంస్థ‌నైనా ల‌క్ష్యంగా చేసుకున్న‌ప్పుడు ముందు వెనుకా చూసి ఆలోచించి మాట్లాడాల‌న్నారు.

Exit mobile version