ఈసారి ఎన్నిక‌ల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్

hellotelugu-NadendlaMaanohar

అమ‌రావ‌తి : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. రాష్ట్రమంతా సుఖ సంతోషాలతో నిండి ఉండాలి అని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ దిశగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకు వస్తోంది. వైసీపీ నాయకులను జనం ఛీదరించుకుంటున్నారు. అయినా వారు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదే పంథాలో వైసీపీ నాయకులు ముందుకు వెళితే గత ఎన్నికల్లో ఇచ్చిన 11 సీట్లను కూడా ప్రజలు ఈ సారి ఇచ్చే అవకాశం లేద‌ని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. ఏలూరు జిల్లా సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏ ప్రాంతంలో రానన్ని పెట్టుబడుల ప్రవాహం ఆంధ్రప్రదేశ్ కు వస్తోందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతుకు తోడు సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకు వెళ్తుందన్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఐటీ, ఆహార శుద్ధి పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగ అభివృద్ధి లో రాష్ట్ర పురోగతి పరుగులు తీస్తోందని చెప్పారు. మూడు ఎకనామిక్ జోన్లతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నాం అన్నారు. గూగుల్ డేటా సెంటర్, క్వాంటం వ్యాలీ వంటి సాంకేతికరంగ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా మారిందని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనే బృహత్తరమైన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పవన్ కళ్యాణ్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కాబట్టే రహదారులు అభివృద్ధి చెందుతున్నాయని, రక్షిత మంచినీరు అందించే పథకాల పనులు వేగవంతం అవుతున్నాయని వెల్ల‌డించారు.

Exit mobile version