ప్ర‌భుత్వ స‌మాచారం కోసం డిజిట‌ల్ యాప్ ప్రారంభం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి కొలుసు పార్థ‌సార‌థి

hellotelugu-KolusuParthasarathy

విజయవాడ : ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ రూపొందించిన సమీకృత మొబైల్, వెబ్ అప్లికేషన్‌ను ఆ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి విజయవాడలోని తన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు సమాచారాన్ని స్వీకరించే విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా, డిజిటల్‌, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అందించాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ప్రామాణిక సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలకు చేరవేయడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రభుత్వం, మీడియా, ప్రజల మధ్య మరింత బలమైన డిజిటల్ వారధిగా ఈ యాప్‌ పని చేస్తుందని పేర్కొన్నారు.

మాన్యువల్ ప్రక్రియలను డిజిటల్ విధానంలోకి తీసుకు రావడంతో పాటు ప్రభుత్వం ప్రజలతో మరింత అనుసంధానం కావడానికి ఈ యాప్‌ దోహద పడుతుందని మంత్రి తెలిపారు. యాప్‌ రూపకల్పన, వినియోగంలోకి తీసుకు రావడనికి కృషి చేసిన శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్ ను ప్రత్యేకంగా అభినందించారు. అంతే కాకుండా యాప్ రూపకల్పనలో భాగస్వాములైన సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సాంకేతిక బృందాన్ని కూడా మంత్రి అభినందించారు. సరైన సమాచారాన్ని సరైన సమయంలో, సరైన డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజలకు చేరవేసేలా సాంకేతికతను వినియోగించు కోవాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియా, అవుట్‌డోర్ మీడియా, ఫ్యాక్ట్‌ చెక్‌, కేడర్ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగల సమాచారాన్ని సమీకరించి ఈ డిజిటల్ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ సమాచార ప్రసారం, మీడియా నిర్వహణ, పౌర సంబంధాలు, వాస్తవాల ధృవీకరణ, ప్రకటనలు, కేడర్ నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఆయన వివరించారు . మొబైల్ అప్లికేషన్‌ ద్వారా అధికారులు ఎక్కడి నుంచైనా శాఖకు సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలను పర్యవేక్షించ వచ్చని తెలిపారు. అంతే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కూడా వార్తా విశేషాలు, ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచార ప్రసార కార్యకలాపాలను ఈ యాప్ ద్వారా ప్రజలకు చేరవేసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. దీని వలన క్షేత్రస్థాయి సమాచారం కూడా ప్రజలకు వేగంగా అందుతుందని తెలిపారు.

Exit mobile version