విజయవాడ : పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోమవారం విజయవాడలో ఎడ్ల బండిపై ద్విచక్ర వాహనాలు ఎక్కించి బండిని లాగుతూ నిరసన వ్యక్తం చేశారు వైసీపీ నేతలు . ఈ సందర్బంగా దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ప్రజలపై పెను భారం మోపుతోందని ఆరోపించారు. పాలన గాడి తప్పిందని సీఎం చంద్రబాబు నాయుడు, కొడుకు నారా లోకేష్ లు వ్యక్తిగత ప్రచారం తప్పా రాష్ట్ర అభివృద్ది, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఓ వైపు ధరల దెబ్బకు నానా తంటాలు పడుతుంటే చిలుక పలుకులు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం కాగితాలకే మాటలు కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు దేవినేని అవినాష్.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజల నడ్డి విరిచారని ఆవేదన చెందారు.
పెట్రోల్ డీజిల్ ధరలు మూడు రూపాయలు పెంచి దేశంలోనే ఆంధ్రా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైoదని నిలదీశారు. ఆనాడు ఆయిల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన మాట మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. డబ్బులు పొదుపుగా వాడండి, సైకిల్ తొక్కండి అని ఇప్పుడు చెప్పడం ఎంత వరకు సబబు అని ఫైర్ అయ్యారు దేవినేని అవినాష్. స్థానిక MLA మాత్రం కెమెరాలు పెట్టుకొని మరి సైకిల్ తొక్కుతున్నారంటూ , సిగ్గు అనిపించడం లేదా అని తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాలన చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్నారు.


















