పోలవరం : పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో గ్యాప్–2 నిర్మాణ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకున్నాయి. మంగళవారం గ్యాప్–2 ఎగువ ప్రాంతంలో రాళ్లు పరిచే పనులకు శాస్త్రోక్తంగా పూజలు చేసి శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రతినిధులు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పూజలు నిర్వహించి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటికే గ్యాప్–2 దిగువ ప్రాంతంలో భూమిని పటిష్ట పరిచిన అనంతరం రాళ్లు పరిచే ప్రక్రియ కొనసాగుతోంది. పూజ అనంతరం గ్యాప్–2 ఎగువ భాగంలో కూడా రాళ్లు పరిచే పనులను స్టార్ట్ చేశారు.
ఈ సందర్భంగా జలవనరుల శాఖ డీఈఈలు డి. శ్రీనివాస్, వెంకటరమణ, ప్రేమ్ చంద్ఎం, ఈఐఎల్ జనరల్ మేనేజర్ ఏ. గంగాధర్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయి ప్రణాళికతో నిర్మాణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. గ్యాప్–2 ఎగువ ప్రాంతంలో భూమి పటిష్ట పరచడం, రాళ్లు పరచడం ప్రారంభించామని వారు చెప్పారు. అలాగే డయాఫ్రామ్ వాల్ ఎగువ, దిగువ వైపుల మట్టినింపే పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయని వివరించారు. గ్యాప్–1 లో కూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.















