విజయవాడ : విలువల కోసం జీవితాంతం రాజీలేని పోరాటం చేసిన మహనీయుడు పద్మవిభూషణ్ రామోజీరావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆయన తెలుగు జాతి కీర్తి, తరతరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. రామోజీరావు స్థాపించిన సంస్థలు తెలుగు జాతికి ఆస్తులని అన్నారు. రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొమ్మిది రంగాల్లో విశిష్ట సేవలందించిన తొమ్మిది మందికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వరుసగా రెండో ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు . ఇక నుంచి ప్రతి ఏటా ఈ వేడుకలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
కృష్ణా జిల్లాలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు తన సంకల్పం, క్రమశిక్షణ, విలువలు, నాణ్యత, విశ్వసనీయతతో గొప్ప సంస్థలను స్థాపించి సమర్థంగా నడిపించారని సీఎం వివరించారు. ప్రజల కోసం జర్నలిజాన్ని నమ్ముకుని, అక్షరాన్నే ఆయుధంగా మలచుకుని పోరాటం చేసిన వ్యక్తి అని ప్రశంసించారు. ఈనాడు, మార్గదర్శి, ఈటీవీతో పాటు విలువలతో కూడిన సినిమాలను సమాజానికి అందించారన్నారు. ప్రజా సమస్యలపై స్పందించడంతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఈనాడు సంస్థ ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి పేరు నిర్ణయించే సమయంలో లోతుగా అధ్యయనం చేసి అమరావతి అనే పేరును సూచించారని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణానికి రూ.10 కోట్లు, కరోనా సమయంలో రాష్ట్రానికి మరో రూ.10 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ప్రతి రాత్రి 9 గంటలకు ఈటీవీ వార్తలు చూసి ప్రజలు సమాచారాన్ని తెలుసుకునే స్థాయిలో ఆ సంస్థ విశ్వసనీయత సంపాదించిందన్నారు.

















