హైదరాబాద్ : మహిళల భద్రత అన్నది ప్రభుత్వమే కాదని ఇది ప్రతి ఒక్కరిపై కూడా ఉందని గుర్తు పెట్టుకోవాలని సూచించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా JNTUలో ఏర్పాటు చేసిన STAND WITH HER కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపు కోవడంతో మన బాధ్యత తీరిపోలేదని అన్నారు. మహిళల ప్రాధాన్యతను గుర్తించి, బాధ్యతలను అప్పగించడంలో ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం ఏశారు రేవంత్ రెడ్డి.
సాంకేతికత పెరిగిన తర్వాత సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా పోకిరీల, వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు సీఎం . ఈ సందర్భంలో చట్టాల బలోపేతం, రక్షణ చర్యలతో పాటు మనల్ని మనం మనుషులుగా సంస్కరించుకుని బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళల భద్రతను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు భావించాలని సూచించారు సీఎం. ప్రతి మహిళను మన ఇంటి ఆడబిడ్డగా భావించి, గౌరవించాలని పిలుపునిచ్చారు.
ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే అందిస్తున్నాం అన్నారు. రేషన్ కార్డుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల వరకు మహిళల పేరుతో అందిస్తున్నామని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. సోలార్ విద్యుత్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సుల వరకు మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళా శక్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దాలని STAND WITH HER కార్యక్రమం చేపట్టామన్నారు రేవంత్ రెడ్డి.

















