అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూర్చారని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, మహిళలను ఆర్థికంగా స్వావలంబనగా తీర్చిదిద్దారని అన్నారు. నేడు ఏ ప్రభుత్వం వచ్చినా డ్వాక్రా వ్యవస్థను కొనసాగించకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడిందంటే, ఆ వ్యవస్థ బలాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. మహిళలు కేవలం ఉద్యోగాలు కోరుకునే స్థాయిలో కాకుండా, ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సీఎం చంద్రబాబు సంకల్పంతో పని చేస్తున్నారని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
అదే విధంగా మహానాడు వేదికగా ప్రకటించిన చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ నిర్ణయం మహిళల రాజకీయ సాధికారతకు కొత్త దిశను నిర్దేశించిందని హోంమంత్రి స్పష్టం చేశారు. మహిళలు కేవలం ఓటు హక్కు వినియోగించుకునే స్థాయిలోనే కాకుండా, ప్రజా విధానాలను రూపొందించే స్థాయికి ఎదగాలని తెలుగుదేశం పార్టీ ఆకాంక్షిస్తోందన్నారు. మహిళలకు సరైన అవకాశాలు, ప్రోత్సాహం కల్పిస్తే వారు రాజకీయాలు, పరిపాలన, విద్య, వ్యాపారం సహా అన్ని రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరచగలరని ఆమె పేర్కొన్నారు.
మహానాడు కేవలం రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదని, అది కార్యకర్తల భావోద్వేగాలకు ప్రతీక అని హోంమంత్రి తెలిపారు. తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో మహిళలు మహానాడులో పాల్గొనడం పార్టీపై మహిళలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. మహిళల గౌరవం, భద్రత, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

















