విజయవాడ : నారీ శక్తి వందన అభియాన్ 2023 పేరుతో తీసుకు వచ్చిన మహిళా బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి. డీ లిమిటేషన్ తో సంబంధం లేకుండా 543 పార్లమెంట్ స్థానాలకు మహిళా రిజర్వేషన్లు పాటించాలన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన శాస్త్రీయంగా జరగాలని అన్నారు. 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కులగణన ద్వారా SC, ST, OBC ల జనాభా సంఖ్య తేలాలన్నారు షర్మలా రెడ్డి. కులాల ఆధారంగా డీ లిమిటేషన్ లో రిజర్వేషన్లు పాటించాలని డిమాండ్ చేశారు.
వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలని కోరారు . చిన్న రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకొని ఆమోదమైన పరిష్కారం చూపాలన్నారు. 2029 ఎన్నికల్లోపు దమ్ముంటే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శాశ్వత అధికారం కోసం రాజ్యాంగాన్ని మార్చే కుతంత్రాన్ని అడ్డుకోవడంలో విపక్షానిది విజయమైతే, ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు మహిళలను అడ్డుపెట్టి మోడీ మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు అంటూ ఎద్దేవా చేశారు షర్మిలా రెడ్డి. అధికారిక గణాంకాలు లేకుండా 50 శాతం పెంచి దేశాన్ని ఉద్ధరిస్తామంటే, 2029 ఎన్నికల్లో బీజేపీ లాభం కోసం రాష్ట్రాల సమైక్యతను దెబ్బ తీయాలని చూస్తే..విపక్షం చెప్పేది ప్రతిసారి ఇదే గుణపాఠమే ఎదురవుతుందని హెచ్చరించారు.
