కర్ణాటక : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్రాష్ట్ర సాగునీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇదే సమయంలో రాజోలిబండ డైవర్షన్ స్కీం గురించి కూడా ప్రస్తావించారు. నీటి కొరత నెలకొన్నదని వాపోయారు. సీఎం తుంగభద్ర సమావేశాన్ని, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కార దిశగా ఒక చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు. తుంగభద్ర ప్రాజెక్ట్ వద్ద 33 గేట్ల పునరుద్ధరణ అనేది కేవలం ఒక మౌలిక సదుపాయాల కల్పన చర్య మాత్రమే కాదని, తరతరాలుగా రైతులను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగల చర్య అని ఆయన అన్నారు. రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ కృషి చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS)కు సంబంధించిన ఆందోళనలను ప్రస్తావించారు ముఖ్యమంత్రి తమకు కేటాయించిన 17.9 TMC నీటికి గాను తెలంగాణకు కేవలం 5–6 TMC నీరు మాత్రమే అందుతోందని ఆవేదన చెందారు. దీనివల్ల గద్వాల్, అలంపూర్ , పాలమూరు ప్రాంతాల రైతులకు దాదాపు 10 TMC నీరు వినియోగంలోకి రాకుండా పోతోందని అన్నారు. తుంగభద్రలో పూడిక పేరుకు పోవడం , నీటి కేటాయింపు వివాదాల వంటి అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, శాశ్వత పరిష్కారం కోసం కృషి చేసేలా ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తుంగభద్ర నదీ తీరంలో జరిగిన చర్చలు అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం చేయగలవని రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఈ సమావేశం ఒక ఆరంభం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
