ముంద‌స్తు చ‌ర్య‌ల‌తో డిజాస్ట‌ర్‌ ప్ర‌భావం త‌గ్గుముఖం

హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాత్ కీల‌క ప్ర‌క‌ట‌న

hellotelugu-HYDRAA

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎల్ బీ ఎస్ ఎన్ ఏలో ప్ర‌సంగించారు. ప్ర‌పంచ జ‌నాభా 823 కోట్లుంటే.. అందులో మ‌న దేశ జ‌నాభా 145 కోట్లు. ముంబ‌య్‌, దిల్లీ, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ ప‌ట్ట‌ణాల‌లో ప‌ట్ట‌ణ జ‌నాభా పెరుగుద‌ల గ‌ణ‌నీయంగా ఉందన్నారు. దేశంలో 2050 నాటికి న‌గ‌ర జ‌నాభా 50 కోట్ల‌కు చేర‌నుంద‌ని లెక్క‌లు చెబుతున్నాయి. 1975లో హైద‌రాబాద్ జ‌నాభా 21 ల‌క్ష‌లుండంగా.. ప్ర‌స్తుతం 1.3 కోట్ల‌కు చేరింది. హైద‌రాబాద్‌లో జ‌నాభా వృద్ధి రేటు 6.2 రెట్లుంది. న‌గ‌ర జ‌నాభా పెరుగుద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అంద‌రికీ మెరుగైన‌, ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన జీవ‌నాన్ని అందించాల‌నే ల‌క్ష్యంతో తెలంగాణ ప్ర‌భుత్వం హైడ్రా( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-HYDRAA)ను తీసుకు వ‌చ్చిందని చెప్పారు హైడ్రా క‌మిష‌న‌ర్ .

దేశంలోనే ఇలాంటి వ్య‌వ‌స్థ ప్ర‌ప్ర‌థ‌మ‌మ‌ని పేర్కొన్నారు ఏవీ రంగ‌నాథ్. ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగంగా జ‌రుగుతున్న వేళ‌ ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు, పాల‌న అందించ‌డానికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో చ‌ర్చించ‌డానికి ఉత్త‌రాఖండ్ ముస్సోరీలోని లాల్ బ‌హ‌ద్దూర్ శాస్త్రి నేష‌న‌ల్ అకాడ‌మీలో `మున్సిప‌ల్ గ‌వ‌ర్నెన్స్ ఫ‌ర్ అడ్మినిస్ట్రేట‌ర్స్‌`పేరిట 5 రోజుల మేధో మ‌థ‌నానికి హైడ్రా క‌మిష‌న‌ర్ ప్ర‌త్యేక ఆహ్వానితులుగా హాజ‌ర‌య్యారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్ లు, ముఖ్య ప‌ట్ట‌ణాల మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎన్‌డీఎంఏ, ఎస్‌డీఆర్ ఎఫ్ అధికారులు హాజ‌రైన ఈ స‌ద‌స్సులో హైడ్రా క‌మిష‌న‌ర్ కీల‌క సూచ‌న‌లు చేశారు. హైడ్రా ఆవిష్క‌ర‌ణ‌, విధివిధానాలు, ల‌క్ష్యాలు ఈసంద‌ర్బంగా వివ‌రించారు.

Exit mobile version