నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. తన వల్ల పార్టీ పవర్ లోకి రాలేదన్నారు. తామంతా, కార్యకర్తలు కలిసి పని చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తానే సీఎం తాను 10 ఏళ్ల పాటు ఉంటానని రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. త్వరలో తాను మంత్రిని అవుతానని లేదంటే సీఎం ను అవుతానని, అందుకు తన వద్ద ప్లాన్ కూడా ఉందంటూ ప్రకటించారు. మీరు మునుగోడు చూసుకోండి నేను తెలంగాణను చూసుకుంటానని అన్నారు.
మర్యాదగా నాకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే నేనే లాక్కుంటానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఏఐసీసీ పెద్దలకు వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి చాలా అహంకారంగా మాట్లాడుతున్నాడని, ఆయనకు అంత సీన్ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రా పెత్తందారులు, చంద్రబాబు మనుషుల పెత్తనమే నడుస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. వారికే పదవులు, కాంట్రాక్టులు వస్తున్నాయని మండిపడ్డారు.. కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఏమీ జరగడం లేదంటూ వాపోయారు. రేవంత్ రెడ్డి తను ఏ పార్టీ నుండి సీఎం అవుతాడో చెప్పాలన్నారు . ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అనేది జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి కాదన్నారు.
