విశాఖకు వైసీపీ గంజాయి తెస్తే కూటమి గూగుల్ తెచ్చింది

చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ షాకింగ్ కామెంట్స్

hellotelugu-PanchumarthiAnuradha

అమరావతి : విశాఖను గ్లోబల్ స్థాయి టెక్ నగరంగా తీర్చిదిద్దుతుంటే వైసీపీ మాత్రం ప్రభుత్వంపై విషం చిమ్మడం దారుణ‌మ‌న్నారు ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదట్లో గూగుల్ వద్దని కోర్టులు పిటిషన్‌లు వేసి, వ్యతిరేకించిన వారే నేడు క్రెడిట్‌ను కొట్టేసే పనిలో ఉన్నారని, క్రెడిట్ చోరీ వైసీపీ సిద్ధాంతమని విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రను ఆర్థిక, సాంకేతిక రంగాల్లో ముందంజలో నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో 2014లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దేలా సన్నాహాలు చేశారని అన్నారు. ఆయన కృషితో అనేక అంతర్జాతీయ సంస్థలు విశాఖకు వచ్చాయని చెప్పారు.

యువతకు ఐటీ రంగంలో వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడం జ‌రిగింద‌న్నారు పంచుమ‌ర్తి అనురాధ‌. అయితే 2019లో ప్రభుత్వం మారిన తరువాత ఉత్తరాంధ్ర అభివృద్ధి పూర్తిగా స్తంభించి పోయింద‌న్నారు. విశాఖపట్నం వంటి అభివృద్ధి చెందుతున్న నగరం గంజాయి, భూకబ్జాలు, కిడ్నాప్‌లు, బ్లాక్ మనీ, లిక్కర్ మాఫియా వంటి అక్రమ కార్యకలాపాలకు కేంద్రంగా వైసీపీ నాయకులు మార్చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజలు భయాందోళనల మధ్య జీవించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఐదు సంవత్సరాల పాటు ఉత్తరాంధ్రను, ముఖ్యంగా విశాఖను, పూర్తిగా వెనక్కి నెట్టిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2024లో తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకున్నారని చెప్పారు. విజన్ 2047లో భాగంగా విశాఖపట్నాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలని సంకల్పించారని, దిశగా గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖకు తీసుకు వచ్చారని చెప్పారు.

Exit mobile version