న్యూఢిల్లీ : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపితే తాను పార్టీపై దృష్టి పెట్టానని అన్నారు . యూపీఏ అధికార పంపకంపై తన ఆత్మకథలో సోనియా గాంధీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో తాను, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బాధ్యతలను ఎలా విభజించుకున్నారో సోనియా గాంధీ తన ఆత్మకథలో వెల్లడించారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో తనకు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు మధ్య బాధ్యతల విభజనను వివరించారు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ అనే తన ఆత్మకథలో యూపీఏ దశాబ్ద కాల పాలనలో ఇద్దరు నాయకులకు విభిన్న పాత్రలు ఉన్నాయని, వారు ఒక జట్టుగా పనిచే శారని గాంధీ పేర్కొన్నారు. మా అనుభవం చాలా వరకు సానుకూలంగానే ఉంది. మేము ఒక జట్టుగా పనిచేశాము, మా పాత్రలు విభిన్నంగా ఉండేవి. ఆయన ప్రభుత్వాన్ని నడిపించగా, నేను పార్టీని నడిపించాను అని పేర్కొన్నారు.
ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలను సోనియా గాంధీ ఖండించారు . తాను ప్రభుత్వంపై నియంత్రణ సాధించానన్న లేదా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుండి అధికారిక ఫైళ్లను మామూలుగా కోరారన్న విమర్శలు అర్ధరహితమని కొట్టి పారేశారు. తాను పీఎంఓ నుండి ప్రభుత్వ ఫైళ్లను కోరారన్న వాదనలు దురుద్దేశ పూరితమైనవి, పూర్తిగా అబద్ధం అని ఆమె అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో, ముఖ్యంగా పార్టీ అధికారంలో లేని సంవత్సరాలలో మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభించేలా చూడటానికి తాను సలహాలు ఇచ్చానని గాంధీ అంగీకరించారు. 2004 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గెలిచిన తర్వాత, మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిగా ఎంపిక చేయడానికి దారితీసిన పరిస్థితులపై కూడా పంచుకున్నారు.
2004 ఎన్నికల ఫలితాలు వెలువడటానికి కొన్ని నెలల ముందే తాను ప్రధానమంత్రి కాకూడదని నిర్ణయించుకున్నానని గాంధీ చెప్పారు. తన భద్రతపై ఉన్న ఆందోళనల కారణంగా తన పిల్లలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆమె ఆ పదవిని చేపట్టకూడదని పట్టుబట్టారని ఆమె తెలిపారు.
