వికారాబాద్ జిల్లా : గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూనే ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చాలనే దృఢ సంకల్పంతో తాము పని చేస్తున్నామని పునరుద్ఘాటించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. గత 70 ఏళ్లుగా తీవ్ర అన్యాయానికి గురైన పాలమూరు జిల్లాకు అవకాశం దొరికినప్పుడు అభివృద్ధి ఎందుకు జరగకూడదని ఆయన ప్రశ్నించారు. కరువు కాటకాలు, వలసలతో అతలాకుతలమైన ఈ జిల్లాను ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 2028 నాటికి కృష్ణా నది జలాలతో కొడంగల్ ప్రాంతంలోని భూములకు సాగునీరు అందించి, అక్కడ పంటలు పచ్చగా పండేలా చూడటం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఈ హామీని ఇచ్చారు.
‘ఎల్ నినో’ ప్రభావం, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సంక్రాంతి పండుగ తర్వాత ‘ప్రజాబలం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ పర్యటిస్తానని ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగాచర్ల పారిశ్రామిక పార్కు వద్ద ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అంతకు ముందు ఈ నియోజకవర్గంలో రూ. 9,053 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పోలేపల్లి ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందుకున్న ముఖ్యమంత్రి అనంతరం రైతులు నడుచుకుంటూ వెళ్తున్న సమూహంలో కలిసి వారితో పాటు సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర రావు, డి. శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ , ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ , పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు , రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
