Sugar : భారతీయ ఇళ్లలో చక్కెర వినియోగం విస్తృతంగా ఉంటుంది. టీ, కాఫీ, స్వీట్లు, డెజర్ట్‌లు అన్నింటిలోనూ పంచదార ప్రధాన పదార్థంగా ఉపయోగిస్తారు. అయితే, అధిక చక్కెర వాడకం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు తరచూ హెచ్చరిస్తున్నారు. అందుకే, ఇటీవల చాలా మంది చక్కెర తీసుకోవడం తగ్గించి బెల్లం, తేనె వంటి సహజ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారు. మరికొందరు పూర్తిగా చక్కెరను మానేసి ఆరోగ్యకర జీవనశైలిని అవలంబిస్తున్నారు.
హార్వర్డ్‌లో శిక్షణ పొందిన వైద్య నిపుణుడు డాక్టర్ సౌరభ్ సేథ్ తాజాగా 15 రోజులపాటు చక్కెరను (Sugar) వాడకపోతే శరీరంలో జరిగే మార్పులను వివరించారు. ఈ విషయమై ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Sugar – డాక్టర్ సౌరభ్ సేథ్ వివరణ
డాక్టర్ సేథ్ ప్రకారం, చక్కెర మానేయడం మొదట్లో కొంత కష్టంగా అనిపించినప్పటికీ, కొద్ది రోజుల్లోనే శరీరంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. చక్కెర తీసుకోవడం తగ్గిస్తే చర్మంపై మంటలు తగ్గి ముఖం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అదేవిధంగా కాలేయంలో కొవ్వు నిల్వలు తగ్గి బొడ్డు భాగంలో ఫ్యాట్ కూడా తగ్గుతుంది. కళ్ల చుట్టూ ఉబ్బరం కూడా క్రమంగా తగ్గిపోతుంది.
పేగు ఆరోగ్యం, చర్మ మార్పులు
15 రోజుల పాటు చక్కెరను పూర్తిగా మానేయడం వల్ల పేగుల ఆరోగ్యంపై గణనీయమైన మార్పు కనిపిస్తుందని డాక్టర్ సేథ్ పేర్కొన్నారు. చక్కెర తగ్గించడం వలన గట్ మైక్రోబయోమ్ సమతుల్యం మెరుగుపడుతుంది. ఫలితంగా జీర్ణక్రియ బాగుపడటంతో పాటు ముఖంపై మొటిమలు, ఎరుపు మచ్చలు కూడా తగ్గుతాయి.
ప్రారంభ దశలో ఎదురయ్యే సమస్యలు
ప్రారంభంలోని కొన్ని రోజుల్లో చిరాకు, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చని ఆయన తెలిపారు. కానీ నిరుత్సాహపడకుండా కొనసాగితే శరీరం చక్కెరపై ఆధారపడకుండా సహజ సమతుల్యత సాధిస్తుందని చెప్పారు.
డాక్టర్ సౌరభ్ సేథ్ సూచన ప్రకారం, చక్కెర వాడకాన్ని క్రమంగా తగ్గించడం, తగినంత నీరు తాగడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతుందని అన్నారు.
Also Read : Gold Shops – Huge Crowd : ధన త్రయోదశికి బంగారం షాపుల వద్ద బారులు తీరిన జనం



















