ఏపీని క్రియేటివ్ ఎకాన‌మీ హ‌బ్ గా మారుస్తాం

స్ప‌ష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్

hellotelugu-KandulaDurgesh

ముంబై : ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని క్రియేటివ్ ఎకాన‌మీ హ‌బ్ గా మారుస్తామ‌ని అన్నారు రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ముంబాయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో జరుగుతున్న హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఆసియా (HICSA) 21వ సదస్సులో పాల్గొన్నారు., ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీ 2024–29 , కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై దేశీ, విదేశీ ఇన్వెస్టర్లతో కీలక చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా, ఏపీ పర్యాటక రంగ భవిష్యత్ దిశను స్పష్టంగా ప్రతిపాదిస్తూ, అమరావతిని కేవలం నగరంగా కాకుండా అంతర్జాతీయ క్రియేటివ్ ఎకానమీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని స్ప‌ష్టం చ‌శారు కందుల దుర్గేష్. ఈరోస్ ఇంటర్నేషనల్, రెడ్ బుల్ వంటి గ్లోబల్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు జ‌రిపారు. అమరావతి–విశాఖపట్నం–తిరుపతి ప్రాంతాలను అనుసంధానిస్తూ స్టోరీటెల్లింగ్ కారిడార్, హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో సాంస్కృతిక అనుభూతులు, ‘ఎక్స్‌పీరియన్స్ ఎకానమీ’ వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లే వినూత్న ప్రణాళికలను ఇన్వెస్టర్లకు వివరించారు మంత్రి.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం కంటెంట్, సంస్కృతి, జీవనశైలి, ఇమ్మర్సివ్ డిజైన్ ను పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో విలీనం చేయడంపై సృజనాత్మక , అనుభవ ఆర్థిక వ్యవస్థకు చెందిన పలువురు వాటాదారులు అయిన జేఎస్ డబ్ల్యూ స్పోర్ట్స్, ఆర్ ఎంజెడ్, అర్వాస్, తమరా లీజర్ ఎక్స్పీరియన్సెస్, షాలెట్ హోటల్స్ , హవాస్ మీడియా సంస్థల ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు కందుల దుర్గేష్.

అలాగే, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో జరిగిన చర్చల అనంతరం, నెల రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంటామని వారికి హామీ ఇచ్చారు. సీఎం, డిప్యూటీ సీఎంల సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు, సాంస్కృతిక కథనాలకు , ఇమ్మర్సివ్ టూరిజం అనుభవాలకు ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్ది, యువతకు ఉపాధి కల్పన, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధితో పాటు పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపును సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అని ప్ర‌క‌టించారు.

Exit mobile version