అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు. పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా నిర్వాసితులకు రూ.226 కోట్ల చెక్కును సీఎం అందించారు. గత పాలకుల నిర్లక్ష్యంగా వల్ల పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఆరోపించారు. నిపుణులతో అధ్యయనం చేయించి ఇప్పుడు మళ్లీ రూ. వెయ్యి కోట్లతో కొత్తది నిర్మిస్తున్నామని అన్నారు. అదే విధంగా గత పాలకులు నిర్వాసితులను పట్టించు కోలేదని ఆరోపించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
వరద నీటిలో ప్రజలు మునిగి పోతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని గుర్తు చేశారు సీఎం. పోలవరం ప్రాజెక్టును, నిర్వాసితుల్ని దృష్టిలో ఉంచుకునే రంపచోడవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాగా ఏర్పాటు చేశామని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తోందని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

















