అమరావతి: జేఎన్ టీయూ-జీవీకి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం ఐచ్ఛికాలు ఇచ్చేందుకు జేఎన్ టీయూ-కాకినాడ, జేఎన్ టీయూ జీవీ ఉద్యోగులకు వీలు కల్పించడానికి 2008లో 30వ చట్టంలోని 45వ విభాగాన్ని సవరిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జేఎన్ టీయూ- గురజాడ, విజయనగరం(జేఎన్ టీయూ-జీవీ) ఏ చట్టం కింద, ఏ సంవత్సరంలో స్థాపించారు. జేఎన్ టీయూ కాకినాడ, జేఎన్ టీయూ గురజాడ, విజయనగరం మధ్య బోధన, బోధనేతర సిబ్బంది విభజన లేదా, కేటాయింపులకు సంబంధించి ఆ చట్టంలో ఏదైనా నిబంధన ఉందా అని సభ్యులు పాలవలస విక్రాంత్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
2008లో జేఎన్ టీయూ 30వ చట్టాన్ని సవరించిన కారణంగా 2021లోని 22వ చట్టం ద్వారా జేఎన్ టీయూ-జీవీని 12-01-22 తేదీన ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు నారా లోకేష్. జేఎన్ టీయూ యాక్ట్ 2008, సెక్షన్ నెం.45 చూస్తే.. ఎనేబిలింగ్ క్లాజ్ లేకుండా పోయిందన్నారు. దానివల్ల లీగల్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చాయని తెలిపారు. దీనిపై 27 కోర్టు కేసులు ఉన్నాయన్నారు. వెళ్లాల్సిన వారు వెళ్లక, ఆప్షన్ ఇచ్చిన వారిని వీసీ లిలీవ్ చేయక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని మండిపడ్డారు. నెలలో మేం సవరణ పూర్తి చేస్తామన్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీపై యాక్ట్ లో సెక్షన్ నెం.46 విషయానికి వస్తే ఆడిట్ వారు అభ్యంతరం లేవనెత్తారని తెలిపారు. ఆడిట్ పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి చేసిన అనంతరం యూనివర్సిటీకి మేం పేమెంట్ చేస్తాం. గ్యాప్ లేకుండా చూస్తాం. రూ.119 కోట్లు ఇప్పటికే బదిలీ చేశాం. అది ఆడిట్ అయిన తర్వాత బ్యాలెన్స్ మేం పూర్తిచేస్తామని చెప్పారు.

















