అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మడ అడవుల పెంపకం లో గాని, తీర ప్రాంతాన్ని రక్షించడంలో గాని మూడు దశలుగా గ్రీన్ బెల్టు అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం అన్నారు. దీనిలో తీర ప్రాంత వాసులను కూడా మమేకం చేసి వారి జీవన ప్రమాణాలు పెరిగేలా వారికి సుస్థిరమైన ఆదాయం అందేలా ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పారు. తీర ప్రాంతంలో పెంచే అడవుల నుంచి ఆదాయం వచ్చే పద్ధతుల మీద స్కిల్ డెవలప్మెంట్ పెంచుతాం అన్నారు. వారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తూ మార్కెటింగ్ మీద దృష్టి సారిస్తాం అన్నారు పవన్ కళ్యాణ్. ఎకో టూరిజం అభివృద్ధి చేసి ఆదాయం పొందే మార్గాలను తయారు చేస్తామని చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో రాష్ట్రంలో 50 శాతం భూభాగంలో గ్రీన్ కవర్ ఉండాలనే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. దీనిలో భాగంగా తీర ప్రాంతంలో గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా చేపట్టామని చెప్పారు. తీర ప్రాంతంలో విభిన్నమైన దేశవాళీ మొక్కలను పెంచి వాటి ద్వారా ఆదాయం సాధించే ఓ బృహత్తర ప్రణాళిక దీనిలో దాగి ఉందన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా దాని నుంచి ఆర్థికంగా ఫలాలు స్వీకరించాలి అని కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అని ప్రకటించారు. గ్రేట్ గ్రీన్ వాల్ సాకారం అయితే ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లోనూ మొదలవుతుందని చెప్పారు. దీనికి అటవీ శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అటవీ శాఖతోపాటు ఇతర శాఖలను కూడా సమన్వయం చేసుకొని, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. దీని ద్వారా తీర ప్రాంతానికి అద్భుతమైన రక్షణతో పాటు, తీర ప్రాంతంలో ఉన్న వారికి మంచి ఆదాయం లభించే అవకాశాలు ఉంటాయని చెప్పారు.
