తిరుపతి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జైళ్ల శాఖను ప్రక్షాళన చేసి తీరుతామని ప్రకటించారు. తిరుపతిలోని స్పెషల్ సబ్ జైల్లో రాష్ట్ర హోం మంత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఉదయం సబ్ జైల్‌కు వెళ్లిన మంత్రి, జైలులో ఖైదీలకు కల్పిస్తున్న వసతులను గురించి జైల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకు రావడం కోసమే జైళ్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తిరుపతిలోని స్పెషల్ సబ్ జైల్ విస్తీర్ణం తక్కువగా ఉందని, ఖైదీల సంఖ్య 120 ఉండాల్సిందన్నారు. 140 మంది ఉన్నట్లుగా తెలిసిందన్నారు. సబ్ జైల్ ప్రస్తుత విస్తీర్ణం 70 సెంట్లుగా ఉన్నట్లు జైలు అధికారులు చెప్పారన్నారు.
దీన్ని పెంచాలా.. లేక మరోచోట నిర్మాణం చేయాలా అనేది పరిశీలిస్తామని తెలిపారు హోం శాఖ మంత్రి. ఖైదీల భద్రత తమ బాధ్యత అని.. ఖైదీల్లో కూడా పరివర్తన రావాలని అనిత వంగలపూడి అన్నారు. రాష్ట్రంలో సంచలనమైన కేసులను త్వరితగతిన విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పని చేస్తున్నాయన్నారు. అవసరమైతే మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. జైల్ సిబ్బంది, పోలీసులు వేరన్నారు. ఖైదీల్లో పరివర్తన కోసం జైల్ సిబ్బంది వారికి దగ్గరగా ఉంటూ..మార్పులు తీసుకు వస్తున్నారని తెలిపారు. జైల్ నుంచి పెరోల్‌పై వచ్చే వారిపై కూడా నిఘా ఉంచుతున్నామన్నారు. జైళ్ల శాఖలో ప్రక్షాళన చేపడతామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ద్వారా పోలీసు, ఫైర్, జైల్ శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
