వ‌రి కొనుగోళ్ల‌లో నిర్ల‌క్ష్యం స‌హించం : సీఎం

మొక్క‌జొన్న కొనుగోలుపై రేవంత్ రెడ్డి స‌మీక్ష

hellotelugu-CM

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిర్ల‌క్ష్యం వ‌హిస్తే స‌హించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. వరి సేకరణ ప్రక్రియ, మొక్కజొన్న కొనుగోళ్ల పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి సేకరణ ప్రక్రియను ‘మిషన్ మోడ్’లో పూర్తి చేయాలని ఆదేశించారు. వరి కొనుగోళ్ల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. వరి సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లలో వివిధ జిల్లాల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, సమస్యల వివరాలను కలెక్టర్ల నుండి అడిగి తెలుసుకున్నారు. గోనె సంచులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని, అలాగే సేకరించిన వరిని గోదాములకు సకాలంలో తరలించేలా పకడ్బందీగా వ్యవహరించాలని స్ప‌ష్టం చేశారు.

వరి రవాణాకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. గోదాముల సమస్యలు ఉన్న ప్రాంతాల్లో, అవసరాన్ని బట్టి వరిని నిల్వ చేయడానికి రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను తాత్కాలికంగా వినియోగించు కోవాలని సూచించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మొక్కజొన్న పంట అధికంగా ఉన్న జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. వరి సేకరణ , మొక్కజొన్న కొనుగోళ్లపై నివేదికలను ప్రధాన కార్యదర్శికి (Chief Secretary) సకాలంలో పంపాలని అన్నారు.అకాల వర్షాల వల్ల వరి తడిసి పోకుండా నివారించడానికి, రైతులు ఇబ్బందులు పడకుండా చూసుకోవడానికి, తార్పాలిన్లను (కప్పుకునే పట్టలు) సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

వాతావరణ శాఖ సూచనల ఆధారంగా, మండల స్థాయిలో ఒక అధికారిని నియమించి, రైతులను సకాలంలో అప్రమత్తం చేసేలా చూడాలన్నారు. అలాగే వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

Exit mobile version