హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని ప్రశంసలు కురిపించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. బుధవారం ఓయూలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని అంటే ఎందుకంత ధైర్యం చేస్తున్నావని నన్ను కొంతమంది అడిగారని చెప్పారు. ఇక్కడికి రావాలంటే ధైర్యం కాదు కావాల్సింది అభిమానం ఉంటే చాలని చెప్పానన్నారు. గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని యూనివర్సిటీకి అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు సీఎం. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చానని అన్నారు.
తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం, పౌరుషం ఉందన్నారు.
ఆ చైతన్యం, పౌరుషానికి చదువుతో పని లేదన్నారు ఎ. రేవంత్ రెడ్డి. ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతీసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైందని అన్నారు. కొమురం భీమ్ నుంచి సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యంపై పోరాటం కొనసాగిందని గుర్తు చేశారు సీఎం. మన సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే తెలంగాణ సాధనతోనే జరుగుతుందని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారని చెప్పారు రేవంత్ రెడ్డి. పీవీ నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదని అన్నారు. ఇక్కడ చదువు కోవడం అంటే అదృష్టం ఉండాలన్నారు.
















