శ్రీ సత్యసాయి జిల్లా : బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు మంత్రి ఎస్. సవిత. మీ అయిదేళ్ల పాలనలో బీసీలను అణగదొక్కారు. ఇదేంటని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైల్లో బంధించారు. బీసీ బిడ్డను పెట్రోల్ పోసి తగులబెట్టారు. అక్రమ సంపాదనకు, అవినీతికి బీసీలను పావులుగా చేసుకున్నారు. చివరికి బీసీ బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేక అయిదేళ్లలో బీసీ హాస్టళ్లను, గురుకులాలను గాలి కొదిలేశారు.. ఆనాడు బీసీల సంక్షేమం ఎందుకు గుర్తుకు రాలేదా..?’అని జగన్ ను ప్రశ్నించారు. బీసీలను రాజకీయంగా జగన్ దెబ్బతీస్తే వెనుబడిన వర్గాలను సీఎం చంద్రబాబు నాయుడు అక్కున చేర్చుకున్నారన్నారు. బీసీలకు ఒకవైపు సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే, రాజకీయంగా వారి ఉన్నతికి పదవులు కేటాయిస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని, ఇందుకోసం న్యాయ పోరాటం చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు.
రొద్దం మండలం కొగిర గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. పెనుకొండ నియోజక వర్గంలో 85 శాతం మేర ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నా బీసీలంటూ అధికారంలోకి వచ్చిన జగన్ బడుగు, బలహీన వర్గాల వారిని తన అయిదేళ్ల పాలనలో అణగదొక్కారని మంత్రి సవిత మండిపడ్డారు. సంక్షేమం, స్వయం ఉపాధి పథకాలు నిలిపేసి ఆర్థికంగా నిలదొక్కుకోకుండా అడ్డుకున్నారన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించి, బీసీలను రాజకీయంగా దెబ్బ తీశారన్నారు. దీనివల్ల బీసీలు 16,800 పదవులకు దూరమయ్యాయని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారన్నారు. బీసీ బిడ్డలు చదువు కోవడం ఇష్టం లేక బీసీ హాస్టళ్లను, గురుకులాలను గాలికొదిలేశారన్నారు సవిత.

















