హైదరాబాద్ : ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు రాష్ట్ర బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. స్థానిక ఎమ్మెల్యేలతో ఏపీకేవీఐబీ సిబ్బంది సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆయా యూనిట్ల ఏర్పాటుపై మీడియా సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలపై ఆయా సమావేశాల్లో, సదస్సుల్లో వివరించాలన్నారు. సోషల్ మీడియాలోనూ స్వయం ఉపాధి పథకాల యూనిట్ల ఏర్పాటుపై ప్రచారం చేయాలన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్తను తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాల్సి ఉందన్నారు సవిత. ఇంతవరకూ యూనిట్ల లబ్ధిదారులతో త్వరలో భారీ సమావేశం నిర్వహిద్దామన్నారు.
లబ్ధిదారులు ఏ మేరకు లబ్ధిపొందారో ఆ సమావేశంలో చెప్పడం ద్వారా మరింత మంది యువత పీఎంఈజీపీ యూనిట్ల ఏర్పాటుక ముందుకొచ్చే అవకాశముందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి సవిత స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని ఏపీకేవీఐబీ సీఈవో సింహాచలాన్ని మంత్రి ఆదేశించారు. అవసరమైతే, తాను కూడా ఢిల్లీ వచ్చి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి, రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడడంలో నిర్లక్ష్యం చూపొద్దన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ కేకే చౌదరి, బోర్డు సభ్యులు తిరుపతి కుమార్, సాంబశివరావు, శ్రీనివాసరావు, శిరీష్ దేవి, ఏపీకేవీఐబీ అధికారులు పాల్గొన్నారు.
