చెన్నై : తమిళనాడు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అశేష జనవాహిని సమక్షంలో కొలువు తీరారు టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. తొలి ప్రసంగంలోనే ఆయన ఆకట్టుకున్నారు. తను ఏం చేస్తాననేది స్పష్టం చేశారు. పనిలో పనిగా గత సర్కార్ రూ . 10 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా కేంద్రిత పాలన కొనసాగిస్తామని చెప్పారు. ఆదివారం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలోని సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మారుమోగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్ విజయ్ చేత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, విజయ్ , ఆయన మంత్రివర్గంలోని 9 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తన తొలి ప్రసంగంలో తన విజయానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
రండి, మనమందరం కలిసి తమిళనాడుకు ఒక సరికొత్త ప్రభుత్వాన్ని అందిద్దాం అని పిలుపునిచ్చారు టీవీకే విజయ్. ఇది ఒక కొత్త ప్రారంభం, లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన ఒక కొత్త శకానికి నాంది అని అన్నారు. నా ప్రియమైన ప్రజలారా, నా సొంత కుటుంబమా, నేను ఏ దైవ దూతను లేదా ప్రవక్తను కాను. నేను ఒక సాధారణ జీవితం గడుపుతున్న సామాన్య మానవుడిని మాత్రమే. నేను మిమ్మల్ని తప్పుడు వాగ్దానాలతో ఎప్పటికీ మోసం చేయను. సాధ్యమైన దానినే వాగ్దానం చేస్తాను అని ప్రకటించారు. తన నిరాడంబర నేపథ్యాన్ని నొక్కిచెబుతూ అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు తాను చేసిన వాగ్దానాలను నెరవేరుస్తానని టీవీకే అధినేత హామీ ఇచ్చారు. తాను తమిళనాడు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.
